Posts

Showing posts from February, 2026

శీర్షిక: వెనక్కి తిరిగిన వెన్నెల (ఎపిసోడ్ 9)

​.     అమ్మనాన్నలు పదేళ్ల క్రితమే చనిపోయారని, నాన్న మరణిస్తే అమ్మను కూడా అదే సమాధిలోకి బలవంతంగా పంపేశారని విన్న క్షణం నా ప్రపంచం కుప్పకూలిపోయింది. ఆ చేదు నిజాన్ని భరించలేక నేను కుమిలిపోతుండగా, ఆకాష్ గారు అక్కడికి చేరుకున్నారు. ​విలవిలలాడుతున్న నన్ను ఓదారుస్తూ, ఆయన గంభీరంగా ఊరి జనాన్ని చూసి అన్నారు.. "ఇంకెన్నాళ్లు? ఇంకెన్నాళ్లు ఈ అరాచకాలు? సమాజం ఎంతో మారిపోతోంది, కానీ ఈ ఊరు మాత్రం ఇంకా ఈ మూఢాచారాల చీకటిలోనే ఉండిపోతానంటోంది. వెలుగుతున్న కొత్త ప్రపంచాన్ని చూడలేని కళ్లు ఇవి!" ​ఆయన నా చేయి పట్టుకుని, "పదా వెన్నెలా.. నీ మనసు చంపేసిన ఈ ఊరిలో మనం ఒక్క క్షణం కూడా ఉండొద్దు" అని నన్ను నడిపించారు. వెనక్కి తిరిగిన నేను, చివరిసారిగా నా పుట్టింటి నేల మీద వంగి.. ఒక పిడికెడు మట్టిని తీసుకుని నా పిడికిలిలో గట్టిగా దాచుకున్నాను. ​నా గతాన్ని, నా అమ్మ జ్ఞాపకాన్ని ఆ మట్టి రూపంలో నా ప్రాణంగా పట్టుకుని, వెన్నెల ఆ ఊరి పొలిమేర దాటింది. మళ్ళీ ఎప్పటికీ వెనక్కి తిరిగి చూడని ప్రయాణం వైపు.. కొత్త వెలుగుల వైపు! ​ముగిసింది.

వెనక్కి తిరిగిన వెన్నెల (ఎపిసోడ్ 8)

ఎన్నో ఏళ్లు గడిచాయి. అమ్మనాన్నలు రావొద్దన్నారు కాబట్టి నేను వాళ్ల కోసం ఎదురుచూశాను. కానీ ఇక ఆగలేక నేరుగా ఊరికే బయలుదేరాను. ఊరికి దగ్గరవుతుంటే పచ్చని పైరు గాలి నన్ను పలకరిస్తున్నట్టు అనిపించింది. బస్సు దిగగానే మట్టి వాసన.. నేను రాకముందే వాన జల్లు కురిసి ఆ పరిమళాన్ని నా కోసం దాచినట్టుంది. ​ఊరి పొలిమేరలో బోడ్రాయి దగ్గర సిమెంట్‌తో కట్టలు కట్టారు. పాత బావి దగ్గర కొత్త గిలకలు వచ్చాయి. రోడ్లన్నీ బాగుపడ్డాయి. ఇల్లు కూడా మారిపోయాయి. గోళీలు ఆడుకున్న పిల్లలు పెద్దవాళ్లయ్యారు. ఆ ఊరి కోడళ్లుగా కొందరు, పెళ్లిళ్లు చేసుకుని పట్నం వెళ్లిన వారు కొందరు.. అంతా కొత్తగా ఉంది. మా ఇంటి దగ్గర గోరింటాకు చెట్లు మాత్రం బాగా పెరిగి దట్టంగా మారాయి. ​పెద్దయ్య ఫోన్ ఎత్తడం లేదని నా భర్త ఆకాష్ గారు తన నెంబర్ నుండి మళ్ళీ ఫోన్ చేశారు. "పెద్దయ్య గారు, వెన్నెల ఊరికే వస్తోంది, తను వచ్చేసరికి పద్ధతులు మారాయో లేదో అని తన భయం. మీరు కొంచెం చూసుకోండి" అని చెప్పారు. అది విన్న పెద్దయ్య గారు వణికిపోతూ, "ఎందుకు బాబు పంపించావు? నువ్వు వెంటనే ఇక్కడికి వచ్చేయ్!" అని కంగారుగా పరుగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చారు. ​...

శీర్షిక: వెనక్కి తిరిగిన వెన్నెల (ఎపిసోడ్ 7)

పట్నం వచ్చాక ఒకరోజు నేను నా భర్త ఆకాష్ గారితో మా ఊరిలో జరిగిన జ్యోతి అక్క విషాద గాథను చెప్పాను. ఆ క్రూరమైన ఆచారం, ఆ మనుషుల రాక్షసత్వం గురించి వింటుంటే ఆయన ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఏదో తెలియని కంగారు, పశ్చాత్తాపం ఆయన కళ్లల్లో కనిపించాయి. ​"ఎందుకు అంత కంగారు పడుతున్నారు?" అని అడిగాను. ఆయన చెప్పిన మాట విన్నాక నా గుండె ఆగిపోయినంత పని అయింది. ​"వెన్నెలా... జ్యోతి అక్క భర్త దినపత్రికలు చదివేవారన్నావు కదా! ఆ రోజుల్లో నేను సామాజిక మార్పు కోసం పత్రికల్లో ఎన్నో వ్యాసాలు రాసేవాడిని. నా రాతలు చదివిన ఎవరో ఒకరు నాకు తరచూ ఉత్తరాలు రాసేవారు. ఆ ఉత్తరాలకు సమాధానంగా నేను కూడా ఎన్నో సూచనలు పంపేవాడిని. సామాజిక అరాచకాలపై గళమెత్తమని, మూఢాచారాలను ఎదిరించమని నేను రాసిన ఆ అక్షరాలే ఆయనను ప్రభావితం చేశాయి. ఆ అక్షరాలే ఆయనలో తెగింపును నింపాయి. చివరకు నా మాటలే ఆయన ప్రాణాలు పోవడానికి కారణమయ్యాయా?" అంటూ ఆయన కుమిలిపోయారు. ​నా అక్షరాలే ఆయనను మృత్యువు ఒడికి చేర్చాయన్న నింద ఆయన మనసును తొలిచేస్తోంది. అటు జ్యోతి అక్కను కోల్పోయిన ఊరి జ్ఞాపకం, ఇటు తన రాతల వల్లే ఇదంతా జరిగిందన్న భర్త ఆవేదన... నా చుట్టూ ...

వెనక్కి తిరిగిన వెన్నెల (ఎపిసోడ్ 6)

పుట్టింటి గడప దాటి పట్నం చేరాను. అప్పట్లో మా ఊర్లో ఒకే ఒక ఫోన్ ఉండేది. ఊరి పెద్దయ్య కొడుకు పట్నం నుండి పంపించారంట ఆ ఫోన్. అమ్మ నాతో మాట్లాడాలని అన్నోసార్లు ఆ ఫోన్ ద్వారా ప్రయత్నించేది. ఫోన్ కలిసినప్పుడల్లా అమ్మ గొంతు వింటే ప్రాణం లేచి వచ్చేది. ​గర్భం దాల్చడానికి కూడా సిద్ధంగా లేని ఈ పసి ప్రాణానికి ఎందుకు పెళ్లి చేశారంటే.. ఆ ఊరిలో అంత ప్రమాదం పొంచి ఉందని నా భర్త, అత్తయ్య మాట్లాడుకుంటుంటే విన్నాను. అప్పుడే నాకు అర్థమైంది, అమ్మనాన్నలు నన్ను వదిలించుకోవడానికి కాదు, నా క్షేమం కోసమే గుండెను రాయి చేసుకుని పట్నం పంపించారని. అదృష్టవశాత్తూ నా అత్తమామలు నన్ను కోడలిలా కాకుండా కన్నకూతురిలా చూసుకున్నారు. ​కొన్ని రోజులకి నేను గర్భవతినయ్యాను. ఒక బిడ్డకు తల్లిని కాబోతున్నానన్న వార్త తెలియగానే ముందుగా అమ్మ గుర్తొచ్చింది. "అమ్మా! నేను తల్లిని కాబోతున్నాను, నేను ఊరికి వచ్చేస్తాను అమ్మా!" అని ఫోన్లో ఆరాటపడ్డాను. కానీ అమ్మ మాత్రం "వద్దు తల్లి, నువ్వు రావడం వద్దు, మేమే పట్నం వస్తాం" అని చెప్పింది. ​ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. అమ్మతో మాట్లాడదామని ఫోన్ చేస్తే పెద్దయ్య ఫోన్ ఎత్తడం లేదు. ఎ...

వెనక్కి తిరిగిన వెన్నెల (ఎపిసోడ్ 5)

పెళ్లి అంటే పూర్తిగా తెలియని వయసు అది. కానీ అమ్మనాన్నలు నా క్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని నా చిన్న ప్రాణానికి అర్థమైంది. రేపు తెల్లవారితే నా పెళ్లి. ఆ రాత్రంతా ఆ చిన్న ఊరు ఊరంతా నా పెళ్లి పనుల్లో సందడిగా ఉంది. ఆ ఊరి జనం నాపై చూపించే ప్రేమాభిమానాలు ఆ రోజే నాకు పూర్తిగా తెలిశాయి. ​ఉదయాన్నే నా చిన్ని చేతులు, కాళ్లు పసుపు పారాణితో మెరిసిపోతున్నాయి. పందిరిలో పచ్చని పండు వెన్నెలకు బొట్టు పెట్టినట్టున్న నా ముఖం చూసి అమ్మ దిష్టి తీసింది. నా చిన్న చిరునవ్వు చూసి అమ్మ ఆనందం రెట్టింపైంది. అందరూ అక్షింతలు వేసి దీవించారు. పెళ్లి కొడుకు తరపు వారు వచ్చారు. నా జీవితాన్ని మలుపు తిప్పి, నా చేత శాసించబడుతున్న నా భర్త ఆకాష్ గారు నా మెడలో మూడు ముళ్లు వేశారు. అవును, ఆరోజు వచ్చిన ఆ పెళ్లి కొడుకే.. ఇవాళ నన్ను మళ్లీ నా సొంత ఊరికి పంపించారు. ​తెల్లవారుజామున పెళ్లి జరిగిపోయింది. అందరి నవ్వులు, సంతోషాల మధ్యే.. నేను నా పుట్టింటిని వదిలి వెళ్లాల్సిన సమయం రానే వచ్చింది. నా బట్టలు ఉన్న ఇనుప పెట్టెను నాన్న మోస్తుంటే, ఒడి బియ్యం పట్టుకుని అమ్మ నాతో నడిచింది. పుట్టింటి గడపకు బొట్టు పెట్టి, నా కన్నీళ్లతో ఆ గడపను కడ...

వెనక్కి తిరిగిన వెన్నెల (ఎపిసోడ్ 4)

 కాలం గడుస్తున్నా ఆ భయంకరమైన దృశ్యాలు నా కళ్ళ ముందే మెదులుతున్నాయి. ఒకరోజు నేను అమ్మతో కలిసి ఇంటి బయట అరుగు మీద కూర్చుని ఉన్నాను. అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి నా వైపు వింతగా చూస్తూ, నెత్తి నిమురుకుంటూ వెళ్ళాడు. ఆ చూపులోని అర్థం నాకు తెలీదు కానీ, అది గమనించిన అమ్మ మాత్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెంటనే నా బట్టలు సరిచేస్తూ నన్ను గబగబా ఇంట్లోకి తీసుకెళ్లిపోయింది. ఆ క్షణం నుండే అమ్మ మనసులో ఒక భయం, ఒక గాఢమైన ఆలోచన మొదలయ్యాయి. ​కొన్ని రోజుల తర్వాత అమ్మ, నాన్నలు మాట్లాడుకుంటున్న మాటలు నా చెవిలో పడ్డాయి. "ఈ ఊరిలో ఆచారాల పేరుతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. మన వెన్నెలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే తనని ఇక్కడి నుండి పంపించేయాలి" అంది అమ్మ. ఆ మాటలు వినగానే నా ప్రాణం విలవిల్లాడిపోయింది. కళ్లల్లో నీళ్లతో అమ్మనాన్నల దగ్గరికి వెళ్తే, వాళ్లు నన్ను గుండెలకు హత్తుకున్నారు. ​"పట్నంలో ఉండే మా అన్నయ్యకు ఒక కొడుకు ఉన్నాడు కదా... మన వెన్నెలను ఆ బాబుకి ఇచ్చి పెళ్లి చేద్దాం. అమ్మ చిన్నప్పటి నుండి పట్నంలోనే ఉంటోంది, అక్కడ ఇలాంటి మూఢాచారాలు ఉండవు. మన బిడ్డ అక్కడైతేనే క్షేమంగా ఉంటుంది" అని అమ్మ న...

వెనక్కి తిరిగిన వెన్నెల (ఎపిసోడ్ 3)

 బస్సు కిటికీలోంచి కనిపిస్తున్న పచ్చని పొలాలు చూస్తున్నాను కానీ, నా కళ్ల ముందు మాత్రం ఆ పన్నెండేళ్ల నాటి భయంకరమైన దృశ్యం కదలాడుతోంది. ​ఆ రోజు నేను ఇంటి ముందు ఆడుకుంటున్నాను. మా ఇంటి పక్కనే ఉన్న పెదమ్మ కూతురు జ్యోతి అక్క ఏడుపు వినిపించింది. చాలా మంది గుమిగూడి ఉన్నారు. ఎందుకు ఏడుస్తోంది అని అర్థం కాక అక్కడికి వెళ్లాను. సరిగ్గా అప్పుడే ఒక ట్రాక్టర్ అక్కడికి వచ్చి ఆగింది. అందులో జ్యోతి అక్క భర్త శవం ఉంది. ​జ్యోతి అక్క భర్త ఒక గొప్ప వ్యక్తి. సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను రూపుమాపాలని పోరాడే సమాజ సేవకుడు. ముఖ్యంగా "సతీసహగమనం" లాంటి క్రూరమైన ఆచారాలకు వ్యతిరేకంగా ఆయన గళమెత్తేవారు. "భర్త చనిపోయినంత మాత్రాన భార్య తన ప్రాణాలను వదులుకోవాల్సిన పని లేదు, ఆమెకు మళ్ళీ జీవించే హక్కు ఉంది, మరో పెళ్లి చేసుకుని ముత్తైదువలా ఉండవచ్చు" అని ఆయన అందరికీ చెప్పేవారు. కానీ, ఆ మాటలను సహించలేని కొందరు మూర్ఖులు ఆయన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. ​ట్రాక్టర్ నుండి తన భర్త భౌతిక కాయాన్ని దించుతుంటే జ్యోతి అక్క పెట్టిన కేకలు నా గుండెల్లో గుచ్చుకున్నాయి. అంతటితో ఆ ఘోరం ఆగలేదు. ఆయన అంత్యక్రియలు జరుగుతున్న సమయం...

వెనక్కి తిరిగిన వెన్నెల (ఎపిసోడ్ 2)

సొంతూరికి వెళ్లే బస్సు కోసం బస్టాప్‌లో ఎదురుచూస్తున్నాను. బస్సు ఇంకా రాలేదు కానీ, నా కళ్ళ ముందు మాత్రం పాతికేళ్ల నాటి దృశ్యం కదలాడుతోంది. ​అమ్మ చేయి పట్టుకుని ఏడుస్తూ వెళ్తున్న ఒక చిన్న పాప.. "అమ్మా నన్ను పంపకు అమ్మా.. నీతోనే ఉంటాను అమ్మా!" అంటూ ఆ పాప అరుస్తున్న అరుపులు నా చెవుల్లో ఇప్పటికీ మారుమోగుతూనే ఉన్నాయి. ఆ రోజు నేను కూడా మా అమ్మను అలాగే ప్రాధేయపడ్డాను. ఆ జ్ఞాపకాల్లో ఉండగానే బస్సు హారన్ కొడుతూ నా ముందు ఆగింది. ​మొత్తానికి బస్సు ఎక్కాను. మనసంతా ఏదో తెలియని ఆందోళన, మరోపక్క అనందం. అది నా సొంత ఊరు.. నేను నడిచిన నేల. పసితనంలో నాకు తినాలనిపించిన కమ్మని మట్టి నేల అది. వాన వస్తే వచ్చే ఆ మట్టి వాసన నాకెంతో ఇష్టం. అందరి ప్రేమానురాగాల మధ్య 12 ఏళ్ల వరకు నా బాల్యం ఎంతో అద్భుతంగా గడిచింది. ​కానీ వయసు పెరుగుతున్న కొద్దీ లోకం కొత్తగా అనిపించింది. నా కళ్ళు, మనసు చుట్టూ జరుగుతున్న నిజాలను చూడటం మొదలుపెట్టాయి. సమాజంలో ఉండే పద్ధతులు, ఆచారాలు అప్పుడప్పుడే నాకు అర్థమవుతున్న సమయం అది. సరిగ్గా అప్పుడే నా జీవితాన్ని మలుపు తిప్పిన ఆ సంఘటన జరిగింది. ఆ రోజు జరిగిన విషయాన్ని నేను ఇప్పటికీ మర్చిపోల...

వెనక్కి తిరిగిన వెన్నెల ఎపిసోడ్ 1

 నా కూతురు సిరి ఇప్పుడే కాలేజీ నుండి వచ్చింది. ఇంట్లోకి వస్తూనే నా ముఖం చూసి ఆశ్చర్యంగా అడిగింది— "ఏంటమ్మా.. నీ ముఖంలో ఈరోజు కొత్త వెలుగు కనిపిస్తోంది, విశేషం ఏంటి?" అని. ​వెనుకనే నవ్వుతూ వచ్చిన తన నాన్న ఆకాష్ గారు అందుకున్నారు.. "మీ అమ్మ 25 ఏళ్ల తర్వాత తన పుట్టింటికి వెళ్తోంది సిరి, ఆ సంతోషం అలా కనిపిస్తోంది!" అని. ​అవును, ఇంతకీ నేను ఎవరో చెప్పలేదు కదా? నా పేరు వెన్నెల. నా భర్త ఆకాష్, నా ప్రాణం నా కూతురు సిరి. పాతికేళ్లుగా నా సొంత ఊరికి, ఆ మట్టికి ఎందుకు దూరంగా ఉన్నానో చెప్పడానికి చాలా కారణాలే ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఒక్క మాటలో చెప్పలేను. ​"వెళ్లి వస్తాను సిరి.. జాగ్రత్త! నేను తిరిగి వచ్చాక నా సొంత మట్టి గురించి, నా గతం గురించి నీకు, మీ నాన్నకు అన్నీ వివరిస్తాను" అని చెబుతూ భారమైన హృదయంతో, అంతే ఉత్సాహంతో ప్రయాణమయ్యాను. ​నా ఈ ప్రయాణాన్ని మీతో పంచుకుంటాను. కానీ ఈ కథ ఇప్పుడు  కాదు ఎప్పుడో మొదలైంది? ఆ రోజు ఏం జరిగింది? అనేది.. వచ్చే ఎపిసోడ్‌లో చెబుతాను.

మౌనం - మనసు అలజడి

మూగబోయిన మనసు వెతికే చీకటి.. కళ్ళు చెప్పే మౌన సాక్ష్యం! ఆగిపోయిన కాలాన్ని తన మౌనంతో పలికించే భావం.. అంతులేని ఆలోచనల అలజడి! ​ఎగసి పడుతున్న అలలను తాకే మెరుపు.. మట్టిలో వేయని విత్తనం.. పెరిగి పెద్దదై మహావృక్షమై ప్రాణం పోస్తుందో.. లేక మౌనంగా మారి మరణిస్తుందో!

జ్ఞాపకం - కరిగిపోని కావ్యం

కలలో కూడా కరిగిపోని కావ్యం.. చెదలు పట్టని.. చెరిగిపోని చరిత్ర పుస్తకపు ఆనవాళ్ళు! కనిపించని చీకటి ప్రపంచాన్ని శాసించే వెన్నెల.. పంచుకోలేని ప్రసాదం, తరగని పరమ సంపద! ​ఆగిపోని హృదయాన్ని.. తాను ఆగిపోయిన జీవితాన్ని చూపిస్తున్నదే ఈ జ్ఞాపకం! కాలం వెనక్కి వెళ్ళదు కానీ.. కనురెప్పల వెనుక మనిషిని బతికించేది ఈ జ్ఞాపకం!

ఆశ - ఆకాశ శిఖరం​

రేపు అనేది నీకు లేని నాడు.. నిన్ను నువ్వు ఓదార్చుకో! వెలుతురు నీ తనువును తాకినంత కాలం.. నీలో ఉన్న నిన్ను నువ్వు కోల్పోకు! ​బతుకును బతికించే ఆశ.. రేపటి కోసం కలలు కంటుంది. నిశీధి కాంతి కరిగిపోక తప్పదు.. పుడమి పురుడు పోసుకునే సమయానికి, ఆ వెచ్చని కాంతి నిన్ను తాకక తప్పదు! ​ఆశలను అంతం చేయకు.. ఆశ లేని ఆనాడు ఉండి ఉంటే.. ఆకాశానికి ఈనాడు ఎగరలేకపోయేవాళ్ళమేమో!

ప్రకృతి - ప్రాణదాత

ప్రాణానికి ఊపిరి పోస్తున్నా.. నీ కష్టానికి చల్లని నీడనవుతున్నా! నువ్వు వదిలే చెడును పీల్చుకుని.. నీకు మంచిని ఇచ్చే ప్రాణవాయువును నేను! ​ఎదిగే కొద్దీ వదగడం రాని నీకు.. సాయమై నిలిచి, అందమైన రూపంతో నీ కళ్ళను నవ్విస్తా! బాధలో ఉన్న నీ బంధాలకు ఆసరాగా నిలిచి.. నిన్ను మోసుకుపోతా, నీకు తోడై ఉంటా! ​రూపం లేదని నా దయను మరువకు.. స్వార్థంతో నన్ను అంతం చేయకు.. నన్ను చంపకు.. నేను నీ ప్రాణాన్ని!

స్నేహం - ప్రాణవృక్షం

సృష్టించలేని రూపం.. స్నేహం! చీకటిలో వెన్నెలలు కాచే వింత వెలుగు మన బంధం. కాలం చూపిన ఈ ప్రాణానికి.. ఆయువు పోసే వృక్షం! ​వసంతాలు ఎన్ని మారినా.. ఈ చెలిమిని మించిన వసంతం మరొకటి లేదు. మరణం వరకు వీడని నీడలా.. మనసుని తాకే మధుర కావ్యం ఈ స్నేహం!

అమ్మ - అనంత రూపం

 అనంత లోకాలలో వెతికినా దొరకని అనంత రూపం.. అమ్మ! ప్రాణం పోసే గర్భగుడిని మోస్తున్న అవని ఆమె.. కనిపించని కాలంతో మనల్ని నడిపిస్తున్న అనంత శక్తి! ​తీరం తెలియని కడలిలా ఎగసిపడే కష్టాలను.. రాతను మార్చే ధైర్యంతో ఎదుర్కొనే సంసార సాగరం ఆమె! మన విజయాల వెనుక నిలిచే నిశ్శబ్ద యోధురాలు అమ్మ.

నీ బాట - నీ విజయం"

 ప్రయత్నం గొప్పదైతే.. దాన్ని నడిపించే నీ జీవిత సమయం ఇంకా గొప్పది! వసంతాలు మారుస్తున్న ప్రకృతికి తెలుసు సమయం విలువ.. బిడ్డను మోస్తున్న గర్భానికి తెలుసు ఆ సమయం విలువ! ​గడిచిన కాలాన్ని ముందుకు నడపలేమని తెలిసినా.. నీ బాట నీకు తెలియదా? మట్టిని తాకిన నీ కాళ్లు పయనిస్తూ ఉంటే.. నదిలా మారిన నీ విజయం ఆ మట్టిని సైతం కొట్టుకుపోయేలా చేస్తుంది! ​సాగిపో.. సాగిపో.. కాటే కాలే వరకు!

జీవన ప్రయాణం"

 ఆగిపోవడం అంటూ ఉంటే.. అది కాటికి వెళ్ళినప్పుడే, అంతవరకు సాగిపోవాలి ఈ జీవిత ప్రయాణం! కాలంతో పాటు కదలాలి నువ్వు.. రేపు అన్నది ఉన్నంతవరకు, నీ ప్రయత్నానికి అడ్డు లేదు. ​కష్టం.. తీరాన్ని తాకే అలలా వచ్చి, కాలంలో కలిసిపోతుంది, విజయం.. నిన్ను స్పృశించే వర్షంలా నిన్ను పరవశింపజేస్తుంది!