వెనక్కి తిరిగిన వెన్నెల (ఎపిసోడ్ 8)
ఎన్నో ఏళ్లు గడిచాయి. అమ్మనాన్నలు రావొద్దన్నారు కాబట్టి నేను వాళ్ల కోసం ఎదురుచూశాను. కానీ ఇక ఆగలేక నేరుగా ఊరికే బయలుదేరాను. ఊరికి దగ్గరవుతుంటే పచ్చని పైరు గాలి నన్ను పలకరిస్తున్నట్టు అనిపించింది. బస్సు దిగగానే మట్టి వాసన.. నేను రాకముందే వాన జల్లు కురిసి ఆ పరిమళాన్ని నా కోసం దాచినట్టుంది.
ఊరి పొలిమేరలో బోడ్రాయి దగ్గర సిమెంట్‌తో కట్టలు కట్టారు. పాత బావి దగ్గర కొత్త గిలకలు వచ్చాయి. రోడ్లన్నీ బాగుపడ్డాయి. ఇల్లు కూడా మారిపోయాయి. గోళీలు ఆడుకున్న పిల్లలు పెద్దవాళ్లయ్యారు. ఆ ఊరి కోడళ్లుగా కొందరు, పెళ్లిళ్లు చేసుకుని పట్నం వెళ్లిన వారు కొందరు.. అంతా కొత్తగా ఉంది. మా ఇంటి దగ్గర గోరింటాకు చెట్లు మాత్రం బాగా పెరిగి దట్టంగా మారాయి.
పెద్దయ్య ఫోన్ ఎత్తడం లేదని నా భర్త ఆకాష్ గారు తన నెంబర్ నుండి మళ్ళీ ఫోన్ చేశారు. "పెద్దయ్య గారు, వెన్నెల ఊరికే వస్తోంది, తను వచ్చేసరికి పద్ధతులు మారాయో లేదో అని తన భయం. మీరు కొంచెం చూసుకోండి" అని చెప్పారు. అది విన్న పెద్దయ్య గారు వణికిపోతూ, "ఎందుకు బాబు పంపించావు? నువ్వు వెంటనే ఇక్కడికి వచ్చేయ్!" అని కంగారుగా పరుగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చారు.
"ఏమైంది పెద్దయ్య? ఫోన్ ఎందుకు ఎత్తలేదు?" అని నేను అడుగుతున్నా ఆయన సమాధానం చెప్పలేదు. "మా ఇంటికి పద అమ్మ, అమ్మనాన్నలను తర్వాత చూద్దువు గాని" అని బతిమాలారు. నేను వినలేదు. ఎంతో ఆనందంతో పరిగెత్తుకుంటూ మా ఇంటికి వెళ్లి "అమ్మా! నాన్నా!" అని కేకలు వేశాను. ఎవరూ బయటకు రాలేదు.
కొద్దిసేపటికి మా వదిన (పెదమ్మ కొడుకు భార్య), అన్నయ్య బయటకు వచ్చారు. నన్ను చూడగానే అన్నయ్య కన్నీళ్లతో నా చేతులు పట్టుకున్నాడు. "ఏమైంది అన్నయ్య? అమ్మనాన్నలు ఊర్లో లేరా?" అని అడిగాను. వాళ్లు ఏడుస్తూ నన్ను లోపలికి తీసుకెళ్లారు. కన్నీళ్లతో మసకబారిన నా కళ్లను తుడుచుకుని చూశాను.
అక్కడ ఉన్న ఫోటోలు చూసి నా గుండె ఆగిపోయినంత పని అయింది.
Comments
Post a Comment