వెనక్కి తిరిగిన వెన్నెల (ఎపిసోడ్ 6)
పుట్టింటి గడప దాటి పట్నం చేరాను. అప్పట్లో మా ఊర్లో ఒకే ఒక ఫోన్ ఉండేది. ఊరి పెద్దయ్య కొడుకు పట్నం నుండి పంపించారంట ఆ ఫోన్. అమ్మ నాతో మాట్లాడాలని అన్నోసార్లు ఆ ఫోన్ ద్వారా ప్రయత్నించేది. ఫోన్ కలిసినప్పుడల్లా అమ్మ గొంతు వింటే ప్రాణం లేచి వచ్చేది.
గర్భం దాల్చడానికి కూడా సిద్ధంగా లేని ఈ పసి ప్రాణానికి ఎందుకు పెళ్లి చేశారంటే.. ఆ ఊరిలో అంత ప్రమాదం పొంచి ఉందని నా భర్త, అత్తయ్య మాట్లాడుకుంటుంటే విన్నాను. అప్పుడే నాకు అర్థమైంది, అమ్మనాన్నలు నన్ను వదిలించుకోవడానికి కాదు, నా క్షేమం కోసమే గుండెను రాయి చేసుకుని పట్నం పంపించారని. అదృష్టవశాత్తూ నా అత్తమామలు నన్ను కోడలిలా కాకుండా కన్నకూతురిలా చూసుకున్నారు.
కొన్ని రోజులకి నేను గర్భవతినయ్యాను. ఒక బిడ్డకు తల్లిని కాబోతున్నానన్న వార్త తెలియగానే ముందుగా అమ్మ గుర్తొచ్చింది. "అమ్మా! నేను తల్లిని కాబోతున్నాను, నేను ఊరికి వచ్చేస్తాను అమ్మా!" అని ఫోన్లో ఆరాటపడ్డాను. కానీ అమ్మ మాత్రం "వద్దు తల్లి, నువ్వు రావడం వద్దు, మేమే పట్నం వస్తాం" అని చెప్పింది.
ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. అమ్మతో మాట్లాడదామని ఫోన్ చేస్తే పెద్దయ్య ఫోన్ ఎత్తడం లేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫోన్ కలవడం లేదు. ఊర్లో ఏం జరుగుతుందో, అమ్మనాన్నలు ఎలా ఉన్నారో తెలియక నా మనసు విలవిల్లాడిపోతోంది.
Comments
Post a Comment